Wednesday 7 June 2017

అపజయం వెనుక ఆరు కారణాలు.


అపజయం వెనుక ఆరు కారణాలు.

 
                     ఇంగ్లిష్…….. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకోవాలన్న ఆలోచనా ఉంది. కాని, కా…నీ……నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ‘ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడాలి’ అన్న లక్ష్యం మాత్రం నెరవేరకపోవడం మనలో చాలా మందిని అసంతృప్తికి గురి చేస్తుంది. కదా? ఈ (తాత్కాలిక) అపజయం వెనకున్న ఆరు కారణాలేంటో చూద్దాం.
1. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కావాల్సిన మోటివేషన్ లేకపోవడం.
 
మీకు తెలుసు. జీవితంలో ఏం సాధించాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా దానికి తగిన ప్రేరణ, స్పూర్తి, చిత్తశుద్ది ఉండాలి. ఏదో అందరూ ‘ముఖ్యం’ అంటున్నారు కాబట్టి ఇంగ్లిష్ నేర్చుకోవాలి అని కాకుండా ఇంగ్లిష్ నేర్చుకుంటే కలిగే లాభాలేంటో మనకు తెలిసి ఉండాలి. కనీసం, ఇంగ్లిష్ రాకపోతే వచ్చే నష్టాలేంటో తెల్సినా చాలు. మన ఉజ్వల భవిష్యత్తే మనకు ప్రేరణ కావాలి.. So, be motivated and learn English.
 
2. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వకపోవడం.
 
ఇదీ మీకీ తెలుసు. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు. ఆచరణ కూడా కావాలి. ఏదో బుద్ది పుట్టినప్పుడు, ఎప్పుడో ఒక సారి కాకుండా రెగ్యులర్ గా, ప్రతిరోజూ కనీసం ఒక అర్థ గంటో, గంటో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కేటాయించాలి. పరిశీలనతో ఇంగ్లిష్ వినడం, చదవడం చేయాలి. కథలో, నవలలో, న్యూస్ పేపరో ఎదో ఒకటి చదవాలి. టీవీ న్యూస్, యూట్యూబ్ వీడియోస్, మూవిస్ ఎదో ఒకటి చూడటం అలవాటు చేసుకోవాలి. కృషి చేస్తే సాధించలేంది ఏమీ లేదు. కాని, కృషి చేయాలి కదా?
 
3. నేర్చుకున్నది ప్రాక్టిస్ చెయ్యకపోవడం.
 
ఇంగ్లిష్ లో మాట్లాడడం ఒక skill, నైపుణ్యం. కేవలం గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఇంగ్లిష్ వచ్చేసినట్లు కాదు. నేర్చుకున్నది, నేర్చుకున్నట్లు ప్రాక్టిస్ చెయ్యాలి. అవకాశమొచ్చినప్పుడల్లా, ఇంకా చెప్పాలంటే అవకాశాలు కల్పించుకుంటూ ఇంగ్లిష్ లో మాట్లాడడం ప్రాక్టిస్ చెయ్యాలి. ఎంత ఎక్కువ ప్రాక్టిస్ చేస్తే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. One important key to success is self-confidence. An important key to self-confidence is practice.
 
4. ఇంగ్లిష్ నేర్చుకోవడంలో అవసరానికి మించి తెలుగు మీద ఆధారపడటం.
 
‘ఇంగ్లిష్ నేర్చుకోవడానికి తెలుగు మీద అవసరానికి మించి ఆధారపడకండి.’ ఈ విషయం తెలుగు లోనే చెప్తున్నామనేం అనుకోకండి. కాని ఇది నిజం. ప్రతీ పదాన్ని, ప్రతీ వాక్యాన్ని తెలుగులో అనుకొని ఇంగ్లిష్ లోకి Translate చేసి మాట్లాడాలనుకోకండి. ఇలా చేయడం వల్ల మీరు సరిగ్గా మాట్లాడలేరు. ఎందుకంటే, ఇంగ్లిష్ వేరు, తెలుగు వేరు. కొత్తలో పర్వాలేదు కాని మెల్ల మెల్లగా మన మాతృభాష మీద అవసరానికి మించి ఆధారపడటం మానెయ్యాలి.
 
5. తప్పులు చేస్తామేమో అని ఎక్కువగా భయపడటం.
 
నడకైనా, నాట్యమైనా, భాషైనా, బాస్కెట్ బాలైనా ఏది నేర్చుకొనేప్పుడైనా తప్పులు చెయ్యడం సర్వ సాధారణం. తప్పులు చెయ్యకుండా ఎవ్వరూ, ఏమీ నేర్చుకోలేరు. ఇది 100% నిజం. కాబట్టి, తప్పుల మీద ఎక్కువ దృష్టి పెట్టడం మానెయ్యాలి. Confident గా మాట్లాడటం వచ్చిన తరువాత మెల్ల మెల్ల గా తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. So, don’t worry much about committing mistakes.
 
6. ఎవరైనా నవ్వుతారేమోనని సిగ్గు పడటం.
 
ఒక ఇరవై, ముప్పై సంవత్సరాల క్రితం ఇంగ్లిష్ లో మాట్లాడడం ఫ్యాషన్ అయితే కావచ్చేమో గాని, ఇప్పుడది ఒక అవసరం. చాలా మందికి ఇంగ్లిష్ లో మాట్లాడాలంటే చెప్పలేనంత సిగ్గు. ‘అంత అవసరమా’ అని అనుకుంటారు. పూర్తిగా ఇంగ్లిష్ రానివారితో కాదు కాని, కళాశాలల్లో, కార్యాలయాల్లో ఇంగ్లిష్ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ప్రాక్టిస్ చెయ్యడానికి సిగ్గుపడకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి మీరు ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్న విషయం అనౌన్స్ చెయ్యండి. ఎవరైనా నవ్వితే అది వాళ్ళ సంస్కార లోపం. మీ అభివృద్దికి సహకరించని వాళ్ళు మీ ఫ్రెండ్సే కారు. అటువంటి వాళ్ళను పట్టించుకోవడం మానెయ్యండి.
 
ఇవీ ముఖ్యమైన ఆరు కారణాలు. ఇందులో మీ కారణమేంటో గమనించండి, ఇవి కాక ఇంకేమైనా కారణాలుంటే ‘ఇంగ్లిష్ బడి’ తో పంచుకోండి.
 
Thanks for reading. ఆలోచించండి. చిత్తశుద్ది తో, ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తే ఇంగ్లిష్ నేర్చుకోవడం పెద్ద బ్రహ్మవిద్యేం కాదు అని మీకూ అర్థం అవుతుంది.
 
Happy Learning!

No comments:

Post a Comment