Monday, 6 March 2017

బ్యాంకులపై యుద్ధం ప్రకటించిన ఖాతాదారులు


హైదరాబాద్: వాతావరణం బాగున్నప్పుడు గొడుగు ఇచ్చి.. వర్షం పడినప్పుడు తీసుకునేదానిపేరే బ్యాంకు అంటూ బ్యాంకింగ్ రంగంపై కొన్ని చలోక్తులు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తీరు పై చలోక్తికి తగ్గట్టుగా ఉంది. అప్పట్లో జీరో ఖాతాతో బ్యాంకు అకౌంట్ ప్రారంభించండి అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కోట్లమంది ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. అప్పుడు ప్రోత్సహించిన బ్యాంకులు ఇప్పుడు మాత్రం ఆ ఖాతాలో డబ్బులు వేసినా.. తీసినా.. సేవాపన్నుతోపాటు అపరాధ రుసుము వసూలు చేస్తామంటున్నాయి బ్యాంకులు.
బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిలు పేరుకుపోవడం, రుణ ఎగవేత దారుల నుంచి డబ్బు వసూలు కాకపోవడంతో నిధుల కొరతను భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఖాతాల నిర్వహణ, లావాదేవీలపై ఆంక్షలు డిపాజిట్లపై వడ్డీ తగ్గించడంలాంటి చర్యలకు పూనుకుంటున్నాయి. నెలలో మూడుసార్లకు మించి నగదు వేసినా.. తీసినా.. సేవా పన్నులు, చార్జీలతో ఖాతాదారుల నడ్డి విరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. అయితే బ్యాంకులు ఏ ప్రాతిపదికన ఈ చార్జిలు విధిస్తున్నాయనేదానిపై మాతం స్పష్టత లేదు. వినియోగదారుల మీద బ్యాంకుల బాదుడు గురించి ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా చార్జిలు వసూలు చేస్తోంది. ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి సొంత వినియోగదారులపైనే కొరడా విధిలిస్తుంటే.. ఆక్సిస్ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో చేసే లావాదేవీలపై ఛార్జీలు విధిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాథమిక బాధ్యతలను గాలికొదిలేస్తూ బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఖాతాదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బ్యాంకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకుంటుంటే రిజర్వు బ్యాంకు ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆపరేటింగ్ ఛార్జీల పేరుతో ఇప్పటికే రకరకాలుగా ఖాతాదారుల సొమ్మును కొల్లగొట్టేస్తున్న బ్యాంకులు ఇప్పుడు బహిరంగంగానే దోపిడీకి దిగుతున్నాయంటూ మండిపడుతున్నారు.
మరోవైపు బ్యాంకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఖాతాదారులు సమరశంఖం పూరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు చార్జిలను వసూలు చేయడమే కాకుండా కొత్త నిబంధనలతో ఇబ్బందులు పెట్టే చర్యలకు దిగిన బ్యాంకులపై ఆన్‌లైన్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. లావాదేవీలపై వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీలను ఎత్తివేయడంతో పాటు.. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడాన్ని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల తీరును నిరసిస్తూ ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే గా పాటించాలనే మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బ్యాంకులను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం సహకరిస్తుందని, అంతా ఒక్కటై ఐకమత్యం బలమేమిటో చూపించాలంటూ కోరుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ రబ్బరు స్టాంప్‌గా మారిపోయారని, ఆయనకు ఆర్బీఐపై నియంత్రణే లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు. ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే సక్సస్ కాకపోతే ఏప్రిల్ 24, 25, 26న కూడా బ్యాంకులు లావాదేవీలు జరపవద్దని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఖాతాదారులు ప్రయోజనం కోసం బ్యాంకుల్ని నియంత్రించేందుకు ఇంతకంటే మంచిమార్గం కనిపించడం లేదని, ఖాతాదారులంతా ఇదే బాట పడితే బ్యాంకులకు ఇక కష్టాలు తప్పవని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, చార్జీల వడ్డనపై బ్యాంకుల వాదన మరోలా ఉంది. దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచడంతో పాటు బ్యాంకుల ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించుకునేందుకే కొత్త ఆంక్షలు తీసుకువస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఖాతాల నిర్వహణతో ఇబ్బంది లేకున్నా నగదు లావాదేవీలు పెరగడం వల్ల బ్యాంకుపై ఎక్కువ భారం పడుతోందని చెబుతున్నారు. ఏటీఎంల నిర్వహణ వల్ల బ్యాంకులపై అదనపు భారం పడుతోందంటున్నారు. అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతున్నారని, బ్యాంకుల విషయంలోనూ టెక్నాలజీ వినియోగం పెరిగేందుకు చార్జీల వడ్డన ఉపకరిస్తుందని అంటున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా అంతిమంగా నష్టపోతుంది, భారం మోస్తోంది ఖాతాదారుడేనన్నది వాస్తవం.

https://www.youtube.com/watch?v=Ep6lFWZsFUw

No comments:

Post a Comment