Monday, 27 February 2017

సులువుగా గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌

సులువుగా గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చాలా సులువుగా ఉన్నదని పరీక్ష రాసిన అభ్యర్థులు, సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. ఎంతో శ్రమతో సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన అభ్యర్థులకు ఒకింత ఉపశమనం కలిగేలా పరీక్ష ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి సుమారు 50 ప్రశ్నలు అడిగారు. 2015 మధ్య నుంచి 2017 జనవరి వరకు కరెంట్‌ అఫైర్స్‌ను ఫాలో అయిన అభ్యర్థులు చాలా సులువుగా సమాధానాలు గుర్తించగలిగారు. ఈ విభాగంలో ఏడు ప్రశ్నల వరకు ఆంధ్రప్రదేశ్ పైనే ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకూ తగిన ప్రాధాన్యం లభించింది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు సులువుగానే ఉన్నప్పటికీ... బ్రెగ్జిట్‌ తరవాత ఈ కింది పరిణామాల్లో ఏది చోటు చేసుకోలేదు? వంటి ప్రశ్నలు అభ్యర్థులను కొంత మేర ఆలోచింపచేశాయి. 2016 నోబెల్‌ పురస్కారం అందుకొన్నది ఎవరు? వంటివి సులువైనవిగా అగుపించాయి. భారత రాజ్యాంగం నుంచి దాదాపు 51 ప్రశ్నలు అడిగారు. ఇవి కూడా సులువుగా ఉన్నాయనే చెప్పాలి. రాజ్యాంగంపై ప్రశ్నలను, కరెంట్‌ అఫైర్స్‌కు అనుసంధానించి అడిగారు. చాలా చిన్న చాప్టర్‌ ‘ప్రాథమిక విధులు’ నుంచి దాదాపు ఏడు ప్రశ్నలు వచ్చాయి. దీన్ని బట్టి మెయిన్స్ కు సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ఆర్టికల్స్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం కనిపిస్తోందని సబ్జెక్టు నిపుణులు చెప్పారు. స్ర్కీనింగ్‌ టెస్ట్‌ సిలబస్ లో పేర్కొన్నట్లుగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలు అనే అంశంపై కూడా నాలుగు ప్రశ్నలు అడిగారు.
 
ఏది ఏమైనా భారత రాజ్యాంగం విభాగంలో ప్రశ్నల సరళి సులభ స్థాయి నుంచి ఒక మోస్తరుగా ఉన్నదనే చెప్పాలి. భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రశ్నలు కూడా మోస్తరుగానే ఉన్నాయి. ఈ విభాగంలో ఎక్కువగా గణాంకాలు ఇస్తారని, లేదా ఆర్థిక వ్యవస్థపై బాగా లోతుగా ప్రశ్నలు అడుగుతారని అభ్యర్థులు భావించారు. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయోనని కొంత మంది ఆందోళనకు గురయ్యారు. తీరా ప్రశ్న పత్రం చూశాక ఉపశమనం లభించిందని పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. గరీబీ హటావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇచ్చారు? వంటి సులభమైన ప్రశ్నలతో పాటు వ్యవసాయ గణన, 2010-11కు సంబంధించిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలనూ అడిగారు. సిలబస్ లో కొత్తగా చేర్చిన మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ నుంచి దాదాపు 11 ప్రశ్నలు వచ్చాయి.వీటిలో మొఘలుల కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌కు వెళ్లేది?, 1750లో ప్రపంచంలో తయారయ్యే వస్తువుల్లో సుమారు ఎంత శాతం భారతలో తయారయ్యేవి? వంటి కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఈ విభాగంలో అడిగిన ప్రశ్నల సరళి అభ్యర్థి ప్రిపరేషన్ స్థాయిని బట్టి మోస్తరు నుంచి కొంచెం కఠినంగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

No comments:

Post a Comment