కెరీర్‌ను నిర్దేశించే ఆప్టిట్యూడ్ టెస్ట్
భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన వాటిలో కెరీర్ ఒకటి. కెరీర్ ఎంపికలో తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పదో తరగతి తరవాత, ఇంటర్ అనంతరం, డిగ్రీ తరవాత... ఇలా ప్రతి దశలో కెరీర్‌కు సంబంధించి ఆపై ఏమిటి అనే ప్రశ్నను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఈ విషయంలో చాలా మంది తమ ఆసక్తి ఏమిటో సరిగ్గా గ్రహించరు. స్నేహితులు, బంధువులను అనుకరిస్తారు. లేదంటే గుడ్డిగా వారిని అనుసరిస్తారు. అలా కాకుండా తమ సామర్థ్యం ఏమిటో గమనించి తదనుగుణమైన కెరీర్ ఎంచుకుంటే సక్సెస్‌ఫుల్ లైఫ్‌ను లీడ్ చేయవచ్చన్నది నిపుణుల మాట. సొంత ఆలోచన, సరైన ప్లానింగ్‌తో కెరీర్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. అంతేతప్ప ఇతరుల ప్రభావం ఉండకూడదు. ఒక రంగానికి సంబంధించిన ప్రొఫైల్ చూసి తద్వారా సకె ్సస్, ఫేమ్ వస్తుందని భావించి ఆ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం సహేతుకం కాదు. మన సామర్థ్యాలకు సరిపోయే కెరీర్‌కే ఓటేయ్యాలి. ప్రతి కెరీర్‌కు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు అవసరమవుతాయి. అవి ఆయా అభ్యర్థుల సామర్థ్యాలతో సరిపోలినప్పుడు మాత్రమే అలాంటి కెరీర్‌ను తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కెరీర్‌లో విజయం సాధించగలరు. అయితే ఫలానా కెరీర్ మనకు సూట్ అవుతుందని ఎలా తెలుస్తుందనేది ప్రశ్నార్థకం. ఇటువంటి సందర్భంలోనే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి.
సామర్థ్యం, యోగ్యత
ఆప్టిట్యూడ్ అంటే..సామర్థ్యం, యోగ్యత. కొన్ని ప్రత్యేకమైన పనులను నిర్వహించడానికి వ్యక్తికి సహజంగా లేదా నేర్చుకోవడం ద్వారా వచ్చిన సామర్థ్యాన్ని ఆప్టిట్యూడ్‌గా నిర్వచిస్తారు. కొందరిలో ఇది స్వాభావికంగా(పుట్టుకతో) వస్తే, ఇంకొందరు తమ ప్రయత్నాల ద్వారా పెంపొందించుకుంటారు. ఒక వ్యక్తిలో విభిన్న సామర్థ్యాలు ఉండకపోవచ్చు కానీ ఏదో ఒకసామర్థ్యం మాత్రం తప్పక దాగి ఉంటుంది. అదేమిటో గుర్తించడానికి ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు చాలా ఉపయోగపడతాయి.
కెరీర్ టూల్
ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు వ్యక్తిలోని మేథస్సును, జ్ఞానాన్ని అంచనా వేస్తాయి. ఇందులో సహజ సామర్థ్యాలు, ఆసక్తులు, విలువలు, నైపుణ్యాలు ఆధారంగా మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు వస్తుంటాయి. వీటికి ఇచ్చే సమాధానాల ద్వారా మానసిక సామర్థ్యాన్ని, బలాలు, బలహీనతలను అంచనా వేస్తారు. తద్వారా వ్యక్తుల సామర్థ్యాలకు సరిపోయే కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి సంఖ్యలకు సంబంధించి మంచి అవగాహన ఉంటే ఫైనాన్స, మేనేజ్‌మెంట్ రంగాలను కెరీర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. స్పాటియల్ ఆప్టిట్యూడ్ ఉంటే డిజైనింగ్, ఆర్కిటెక్చర్ వంటి సృజనాత్మక రంగాలను ఎంచుకోవచ్చు. అప్పటికే ఉద్యోగంలో ఉంటే అందులో రాణించడానికి ఏమి చేయాలి అనే అంశాన్ని ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు వివరిస్తాయి. ఇటువంటి ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఇంటర్నెట్‌లో చాలా ఉన్నాయి.
గైడ్‌గా
ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు కెరీర్, ఎడ్యుకేషనకు సంబంధించి స్పష్టతను, నమ్మకాన్ని కలిగిస్తాయి. తదుపరి ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలోనూ ఈ టెస్ట్‌లు గైడ్ చేస్తాయి. చాలా మంది తమ ఆసక్తిని బట్టి కెరీర్ ఎంచుకుంటారు. ఆసక్తి, ఆప్టిట్యూడ్ రెండూ వేర్వేరు అంశాలు. ఆసక్తి అనేది జీవిత అనుభవాలతో సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి కేవలం ఆసక్తి ఆధారంగా కెరీర్‌ను ప్లాన చేసుకోవడం కష్టం. కాబట్టి ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటే ఆ రంగంలో రాణించడానికి అవసరమైన సామర్థ్యాలు ఉండాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.