✍ఈ నెలాఖరుకే గ్రూప్-2 ఫలితాలు
✍గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల విడుదలకు ఎపిపిఎస్‌సి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరు నాటికి ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తుది ''కీ''ని విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో 982 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 26న జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా, మెయిన్స్‌కు 49,106 అర్హత సాధించారు.
✍జులై 16, 17 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, నిబంధనలకు విరుద్ధంగా పలు సెంటర్లలో పరీక్షలు నిర్వహించారంటూ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో లీకేజీ అంశంలో పాటు విశాఖ జిల్లాలోని గీతం వర్సిటీ, ప్రకాశం జిల్లా చీరాల పరీక్షా కేంద్రంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలపై ఎపిపిఎస్‌సి విచారణ చేపట్టింది. పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్ధులను వీడియో ఫుటేజీ ఆధారంగా మినహాయించి మిగిలిన వారి జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
🔹ఎనిమిది ప్రశ్నలు తొలగింపు
✍మెయిన్స్ పరీక్షలల్లో ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండడం, సిలబస్‌లో లేని ప్రశ్నలు అడగటం వంటి అంశాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని ఎపిపిఎస్‌సి నిపుణుల కమిటీకి నివేదించింది. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ, అభ్యర్థులు సూచించిన అభ్యంతరాలపై ఏకాభిప్రాయానికి రావడంతో తుది ''కీ''ని కూడా విడుదల చేశారు. పేపరు-2లో మూడు, పేపరు-3లో ఐదు ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిపుణుల కమిటీ వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి జవాబులు ఒకటికి బదులు రెండు సమాధానాలు ఇవ్వడంతో వాటిలో దేనిని గుర్తించినా మార్కులు ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. మూడు పేపర్లలో కలిని ఇలాంటి ప్రశ్నలు 13 వరకు ఉన్నాయి. మరోవైపు తుది ''కీ''పైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
✍ఎపిపిఎస్‌సి ప్రకటించిన ప్రశ్నలకు కాకుండా మరికొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉన్నాయని చెబుతున్నారు. చాలా వరకు ప్రశ్నలు సిలబస్‌లో లేని అంశాలపై ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిలబస్ కావడంతో ప్రశ్నా పత్రాల రూపకల్పన, జవాబుల గుర్తింపులో ఎగ్జామినర్లు సరిగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఈ అభ్యంతరాలపై నిపుణుల కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిన అనంతరమే తుది 'కీ'ని విడుదల చేశామని ఎపిపిఎస్‌సి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
🔹ఆ 159 మందితో నేరుగా విచారణ
✍గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల్లో జరిగిన గందరగోళంపై విచారణ చేపట్టిన అధికారులు పలువురు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను రిజర్వ్ చేసింది. వివాదాస్పదంగా మారిన విశాఖ గీతం పరీక్షా కేంద్రంతో పాటు ప్రకాశం జిల్లాలోని చీరాలలోని పరీక్షా కేంద్రాల వీడియూ ఫూటేజీలను పరిశీలించిన అధికారులు 159 మంది అభ్యర్ధులు పరీక్షా హాల్ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. వారిపై త్వరలో నేరుగా ముఖాముఖి విచారణ చేపట్టి సంజాయిషీ పత్రాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలా..? వద్దా..? అనేది వారిచ్చే సమాధానాలను బట్టి నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.
☘☘☘☘☘☘☘☘☘☘☘
✍2011 గ్రూప్-1 ఇంటర్వ్యూలెప్పుడో?
✍అది 2011 నాటి గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్. ఆరేళ్లయినా ఖాళీ పోస్టులను మాత్రం భర్తీచేయలేకపోయారు. కనీసం ఇంటర్వ్యూలనూ నిర్వహించలేకపోయారు. ఈ పరిస్థితికి ఏపీపీఎస్సీ చేసిన తప్పిదాలే కారణమంటూ అభ్యర్థులు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 1:50 నిష్పత్తిలో 2012లో మెయిన్స్ నిర్వహించారు. అందులో అర్హులైన అభ్యర్థులకు 2013లో ఇంటర్వ్యూలు జరిపారు.
✍ప్రిలిమనరీలో ఇచ్చిన తప్పుల నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పుతో మూడేళ్ల తర్వాత, అంటే 2016 సెప్టెంబరులో మళ్లీ మెయిన్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నెలలో ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేశారు. అయితే మెయిన్స్ పేపర్-5లో తప్పులు దొర్లడంతో వాటిని తొలగించి .. ఆ మేరకు స్కేలింగ్ చేస్తామంటూ.. గత మార్చిలో కొత్త జాబితా విడుదల చేశారు. ఏప్రిల్‌లో ఆయా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కానీ ఇంటర్వ్యూ రాని కొంతమంది అభ్యర్థులు ఏపీఏటీ ని ఆశ్రయించగా, స్టే విధించింది.
✍ఏప్రిల్ నుంచి స్టే కొనసాగుతోంది. గతంలో చాలా నోటిఫికేషన్ల విషయంలో పై కోర్టులకువెళ్లి స్టే ఎత్తివేయించిన ఏపీపీఎస్సీ.. ఈ నోటిఫికేషన్ విషయంలో మాత్రం చొరవ తీసుకోవడంలేదని అభ్యర్థులు వాపోతున్నారు. మే నెలలో చైర్మన్, సెక్రెటరీని కలవగా, మీరు కూడా ఇంప్లీడ్ అవ్వమని సలహా ఇచ్చారని వారు తెలిపారు. ఏపీపీఎస్సీ చేసిన తప్పులకు రెండుసార్లు ఇంటర్వ్యూలకు అర్హత సాధించినప్పటికీ, ఆరు సంవత్సరాలైనా రిక్రూట్‌మెంట్ పూర్తి కాలేదని ఆవేదన చెందుతున్నారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment