Thursday, 23 February 2017

ఫస్ట్ ఇంప్రెషన్‌తోనే జాబ్ కొట్టేయండి!


ఫస్ట్ ఇంప్రెషన్‌తోనే జాబ్ కొట్టేయండి!


            ఇంటర్వ్యూలో మొదటి ఇంప్రెషన్‌తోనే మీ మీద రిక్రూటర్‌లు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తారు. ఇక దాన్ని మార్చుకోవడం దాదాపు అసాధ్యం! మొదటి అయిదు నుంచి 30 సెకన్లలోనే మీ బాడీ ల్యాంగ్వేజ్ ను గమనించి ఏదో ఒక డెసిషన్‌కు వచ్చేస్తారు. అంటే, ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలంటే మీ ఫస్ట్ ఇంప్రెషనే కీలకం! ఇంటర్వ్యూ సమయంలో మీ బాడీ ల్యాంగ్వేజ్ ఏవిధంగా ఉండాలంటే...
ఆత్మవిశ్వాసంతో లోపలికి వెళ్లండి... ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు మంచి
ప్రొఫెషనల్ గా కనిపించాలి. ఒకసారి మీరు ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే 
మిమ్మల్ని అంచనా వేయడం ప్రారంభమవుతుంది! మీరు బయట వేచి ఉన్న
సమయంలోనూ, ఇంటర్వ్యూ సమయంలోనూ మీ బాడీ ల్యాంగ్వేజ్ ఏవిధంగా
మారుతున్నదీ రిక్రూటర్లు గమనిస్తుంటారన్నది మరువకండి.
బలమైన కరచాలనం... లోపలికి వెళ్లిన తర్వాత ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి బలమైన కరచాలనం ఇవ్వండి... ఏ మాత్రం బలహీనంగా ఉన్నా మీ మీద సదభిప్రాయం కలగదు. అలాగని, చేతివేళ్లని గట్టిగా నొక్కేయకండి!
నిటారుగా కూర్చోండి... కుర్చీలో వెనుకకు ఆనుకుని నిటారుగా కూర్చోండి... అంటే, మరీ స్టిఫ్ గా బిగుసుకుపోయినట్టు ఉండకూడదు. కాళ్లను జాపుకుని కాకుండా దగ్గరగా పెట్టుకుని కూర్చోండి. అప్పుడప్పుడు కొంచెం ముందుకు వంగి మాట్లాడుతుండండి. దీంతో మీరు అటెన్షన్ గా ఉన్నారని రిక్రూటర్ భావిస్తాడు. మరీ ఓవర్ యాక్షన్ ప్రదర్శించవద్దు.
కళ్లలోకి చూసి మాట్లాడండి... దీంతో మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నారని రిక్రూటర్ అర్ధం చేసుకుంటారు. అదేపనిగా కళ్లలోకి చూసి మాట్లాడడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చూపు తిప్పుకోవద్దు! రిక్రూటర్ నుదుడినో, ముక్కునో చూస్తూ కొన్ని సెకన్లు మాట్లాడండి!
నవ్వు ముఖంతో ఉండండి... మీకు కొంత నెర్వస్ గా ఉన్నప్పటికీ, సన్నగా, చిన్నగా నవ్వుతూ ఉంటే, కొంతసేపటికి రిలాక్స్ కావచ్చు. దీనివల్ల మీపై రిక్రూటర్ కు మరింత సదభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీలు ఏడుపు ముఖాలకు జాబ్స్ ఇవ్వవుగదా!
మీ చేతులను గమనించండి... ఇక్కడే చాలా మంది బోల్తా పడుతుంటారు. మీరు పదే పదే ముఖాన్ని తుడుచుకోవడం లేదా ముక్కు రాసుకోవడం వంటివి చేస్తుంటే అబద్ధాలు చెబుతున్నారని అనుమానిస్తారు! మీరు చిన్నగా చేతులు ముడుచుకుని కూర్చోకుండా, చిన్నగా కదిలిస్తూ మాట్లాడాలి.
ఇక సెల్ ఫోన్ ఆఫ్ చేయడం, తల ఎత్తి కూర్చోవడం, కాళ్లు ఊపకుండా ఉండడం మరచిపోవద్దు! అలాగే, కాన్ఫిడెన్స్ వేరు, యారోగెన్స్ వేరన్న సంగతి గుర్తుంచుకోండి. బలహీన కరచాలనం ఇవ్వడం, సాగిలపడి కూర్చోవడం, కళ్లార్పకుండా చూస్తూండడం, పెన్నుతోనో, జుట్టుతోనే ఆడుకోవడం, నెర్వస్ ఫీలవుతూ కనిపించడం చేయరాదు!
అలాగే, బబుల్ గమ్ నమలడం, జేబుల్లో చేతులు పెట్టుకుని కూర్చోవడం, వేళ్లను పదేపదే కొట్టుకోవడం చేయకండి... మీ మాటల కంటే మీ బాడీ ల్యాంగ్వేజే మీ గురించి రిక్రూటర్‌కు మరింత తెలియజేస్తుంది!

No comments:

Post a Comment