Showing posts with label వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌!. Show all posts
Showing posts with label వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌!. Show all posts

Thursday, 7 September 2017

వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌!



వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌!



8,452 పోస్టులకు ఆర్థిక శాఖ ఓకే
టీఎస్‌పీఎస్సీకి వివరాలు అందజేత
ఉమ్మడి జిల్లాల ప్రకారమే భర్తీ!
హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): 


    ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ స్కూళ్లలో 8,452 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు పంపించింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం టీఎస్‌పీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే, అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ఉత్తర్వులు, రోస్టర్‌ పాయింట్ల వివరాలు ఇంకా విద్యాశాఖ నుంచి అందాల్సి ఉంది. వివిధ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో సంక్షేమశాఖలు నిర్ధారించిన విద్యార్హతలు వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలకు లోబడే డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హతలు ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుంచి పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్సీకి అందుతాయని, దీంతో వారంలోగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఉపాధ్యాయ పోస్టులను 31 జిల్లాలుగా కాకుండా, ఉమ్మడి జిల్లాల పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు, ఆ మేరకు జిల్లాల సంఖ్య, పేర్లు పొందుపర్చి ఉన్న కారణంగా సదరు ఉత్తర్వులను రద్దు చేయకుండా కొత్త జిల్లాల పరిధి ప్రకారం ఖాళీల భర్తీ సాధ్యం కాదని న్యాయశాఖ సలహా ఇచ్చినట్లు తెలిసింది. దాంతో పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ సలహా తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసే విషయంలో ప్రభుత్వం సందేహించడానికి మరో కారణం ఉంది. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఒక్కో జిల్లా గరిష్ఠంగా నాలుగు జిల్లాల దాకా విడివడింది. దీంతో కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు, మరికొన్ని జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉన్నాయి.
ప్రత్యేకించి రూరల్‌ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు, అర్బన్‌ జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ అర్బన్‌ జిల్లాల్లోని నిరుద్యోగులు ఇప్పటికే డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులను, నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పాత జిల్లా ప్రాతిపదికన నోటిఫికేషన్‌ జారీ చేసేందుకే ప్రభుతం మొగ్గుచూపిస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ అధికారులు మాత్రం పాత పది జిల్లాలు, కొత్తవి కలిపి మొత్తంగా 31జిల్లాల ప్రకారం ఖాళీలు, రోస్టర్‌ పాయింట్ల వివరాల నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.
మార్పుల్లేని స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌, సిలబస్‌
గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో నిర్ధారించిన స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్నే టీచర్‌ పోస్టుల భర్తీకి అనుసరించనున్నట్టు సమాచారం. ఈమేరకు విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. భర్తీ ప్రక్రియలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రూపంలో రెండంచెల పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రిలిమ్స్‌ నుంచి ఒక పోస్టుకు 15 మందిని ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ను 80శాతంగా, టెట్‌ మార్కులను 20శాతంగా పరిగణించి జాబితాలు సిద్ధం చేస్తారు. టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే జనరల్‌ అభ్యర్థులకు ఎన్‌సీటీఈ ప్రకారం 50శాతం మార్కులు ఉండాలి. ఇదే నిబంధనను నోటిఫికేషన్‌లో పొందుపర్చనున్నారు. సిలబస్‌ కూడా ఇప్పటికే టీఎ్‌సపీఎస్సీ ప్రకటించిన మేరకే ఉండే అవకాశం ఉంది. కేటగిరీ ఉద్యోగాలను బట్టి మారే అవకాశం ఉంది.