Showing posts with label అద్దం ముందు నిలబడి మాట్లాడండి. Show all posts
Showing posts with label అద్దం ముందు నిలబడి మాట్లాడండి. Show all posts

Friday, 10 February 2017

అద్దం ముందు నిలబడి మాట్లాడండి



‘లక్ష్యం మాటల్లో, చేతల్లో ప్రతిబింబించాలి. అందుకు ఆత్మ విశ్వాసం కూడా తోడవ్వాలి. అప్పుడే ఇంటర్వ్యూలో విజయం సాధించగలుగుతారు.’ అంటున్నారు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ దూరదర్శన్‌ న్యూస్‌.. షుజాత అలి. తన కెరీర్‌ అనుభవాలను ఇలా పంచుకున్నారు. 
 
మీ మొట్టమొదటి ఉద్యోగం? 
నా మొట్టమొదటి ఉద్యోగం ఫౌండర్‌ అండ్‌ సబ్‌ ఎడిటర్‌ ఆఫ్‌ మున్సిఫ్‌ డైలీ. 1979లో ఆ వార్తా పత్రికలో పనిచేశాను. అప్పుడే ఆలిండియా రేడియోలో న్యూస్‌ రీడర్‌గానూ పనిచేశాను. ఆ తర్వాత 1983లో యుపిఎస్‌సి పరీక్షలు రాసి ఐఐస్‌ ఆఫీసర్‌గా సెలెక్ట్‌ అయ్యాను. అప్పటికి నా వయసు 24 ఏళ్లు. అలా ఆ హోదాలో ‘సైనిక్‌ సమాచార్‌’కు సబ్‌ ఎడిటర్‌గా జాయిన్‌ అయ్యాను. సైనిక్‌ సమాచార్‌ అంటే.. న్యూస్‌ మ్యాగజైన్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా. నా ఫస్ట్‌ లవ్‌.. ‘జర్నలిజం’. అదృష్టవశాత్తూ నా మొట్టమొదటి గవర్నమెంట్‌ అసైన్‌మెంట్‌ కూడా వర్కింగ్‌ జర్నలిస్ట్‌గానే దొరికింది.
 
మొట్టమొదటి ఇంటర్వ్యూ అనుభవం? 
యుపిఎస్‌సిలో పర్సనాలిటీ టెస్ట్‌ ఎంతో కీలకమైనది. అప్పట్లో ఐదుగురు బోర్డ్‌ సభ్యులు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇంటర్వ్యూలో అవగాహన ఉన్న ప్రశ్నలను రాబట్టాలంటే మనకు పరిఙ్ఞానం ఉన్న అంశాలనే ప్రొజెక్ట్‌ చేయాలి. అలా బోర్డ్‌ మెంబర్ల నుంచి సమాధానం తెలిసిన ప్రశ్నలనే రాబట్టవచ్చు. ఒకవేళ మనకు సినిమాల పరిఙ్ఞానం ఉంటే మన ఫేవరెట్‌ యాక్టర్‌ గురించి చెప్పాలి. అప్పుడు సంబంధిత ప్రశ్నలే అడుగుతారు. నా విషయంలో అదే జరిగింది.
 
మీ కెరీర్‌లో గర్వంగా ఫీలయిన సంఘటన? 
1986లో నేను ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ అసిస్టెంట్‌గా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటుచేసిన సార్క్‌ సమ్మిట్‌కు లైజనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దలు, ప్రముఖుల్ని మరిముఖ్యంగా అప్పటి ప్రిన్సిపల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాను రిసీవ్‌ చేసుకునే అవకాశం దొరకటాన్ని ఇప్పటికీ గర్వంగా ఫీలవుతాను. అలాగే రాజీవ్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌.కె.అడ్వాణీలు ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ల్లో పాల్గొనే అవకాశం దొరకటం ఎప్పటికీ మరచిపోలేను. అలాగే నేను రేడియోలో న్యూస్‌ కరెస్పాండెంట్‌గా చేస్తున్నప్పుడు మతహింసలు చెలరేగిన సందర్భాల్లో బిబిసి, ఇతర అంతర్జాతీయ రేడియోలు నా బ్రీఫ్‌ న్యూస్‌ను కూడా ప్రసారం చేసేవి. ఇది కూడా నాకు గర్వకారణమే!
 
కెరీర్‌ పరంగా యువతకు మీరిచ్చే సలహా? 
ప్రస్తుతం యువతలో ఆత్మవిశ్వాసం, కరెంట్‌ అఫైర్స్‌ మీద అవగాహన కొరవడుతోంది. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను పెంచుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా రోజుకి రెండు రీజనల్‌, రెండు ఇంగ్లీషు వార్తా పత్రికలు చదవాలి. అలాగే రెండు న్యూస్‌ ఛానెల్స్‌ చూడాలి. ఇలా చేస్తే మన చుట్టూ జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే అద్దం ముందు నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మన బాడీ లాంగ్వేజ్‌, మాటలతో సింక్‌ అవుతుందో లేదో తెలుస్తుంది. చెప్పే విషయంలో ఉన్న ఆవేశం, ఉత్సాహం శరీరంలో కూడా ప్రతిబింబించాలి. కాబట్టి అద్దం ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్‌ చేసి ఇలాంటి పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు. ఈ అలవాటు వల్ల కమ్యూనికేషన్‌ పవర్‌ కూడా పెరుగుతుంది. ఎదుటివారితో ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతారు.