దరఖాస్తు సమయంలో ఈ తప్పులు చేయకుంటే జాబ్ గ్యారెంటీ..!
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలతో పాటు బోలెడు నైపుణ్యాలు, కావల్సినంత అనుభవం ఉన్నప్పటికీ కొందరు అభ్యర్థులు మంచి అవకాశాలను కోల్పోతుంటారు. రిక్రూటర్లు వీరిని తిరస్కరించడానికి కారణం స్వయంకృతాపరాధమే. ఉద్యోగ దరఖాస్తులో అభ్యర్థులు చేసే కొన్ని ప్రధానమైన పొరబాట్లు ఇవి...
* అభ్యర్థి తనకు సంబంధించిన పూర్తి వివరాలను దరఖాస్తులో సరిగ్గా ఇవ్వకపోవడం. రోజూ వందలు, వేలల్లో దరఖాస్తులను పరిశీలించే అధికారులు ఇటువంటి వాటిని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి ఆసక్తి చూపించరు. అర్థం కాకపోయినా, అసంపూర్తిగా ఉన్నా ఆ దరఖాస్తును చెత్తబుట్ట స్వాహా చేస్తుంది.
* నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనలు అర్థం చేసుకోకుండా తమకు నచ్చిన విధంగా వ్యవహరించే అభ్యర్థుల పట్ల అధికారులు సానుకూల వైఖరి కనబర్చరు.
* అర్హతలకు తగిన ఉద్యోగాలు అన్నింటికీ ఒకేసారి దరఖాస్తు చేసేందుకు కొన్ని జాబ్ సైట్లలో అవకాశం ఉంది. కానీ ఈ విధానానికి స్వస్తి పలకడమే మంచిది. ప్రతి ఉద్యోగానికి ఆయా సంస్థలను అనుసరించి ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. అన్నిటికీ ఒకే దరఖాస్తు కంటే... వేర్వేరుగా పంపడం ఉత్తమం.
* ‘మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం’ అనే విధానంలో కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వవు. తమకు అవసరమైన, ఉపయోగపడే అభ్యర్థి దొరికేవరకూ రిక్రూటర్లు వేచి చూస్తారు. కాబట్టి దరఖాస్తు చేసే విషయంలో హడావిడి వద్దు. కవర్ లెటర్, దరఖాస్తును ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతే పంపించండి.
* రిక్రూటర్లను ఆకర్షించేందుకు ఎటువంటి గిమ్మిక్కులు చేయవద్దు. కొందరు అభ్యర్థులు తమ వ్యక్తిగత సమస్యలను దరఖాస్తులో రాస్తుంటారు. ఇవేవీ రిక్రూటర్లకు అవసరం లేదు. ఒక సీవీని పరిశీలించడానికి వారు కేటాయించే సమయం కొన్ని సెకన్లు మాత్రమే.
*ఉద్యోగానికి దరఖాస్తు చేసిన తర్వాత పది రోజుల్లోగా అటునుంచి ఎటువంటి సమాధానం లేకపోతే మీరే ఒకసారి ఫాలోఅప్ చేసేందుకు ప్రయత్నించండి. హెచ్‌ఆర్ అధికారులకు ఫోన్ చేసినప్పుడు వీలైనంత మర్యాదగా మాట్లాడండి. మీ దరఖాస్తు గురించి అడుగుతూనే, సదరు ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని వారికి అర్థమయ్యేలా వివరించండి. మీకున్న అదనపు అర్హతలు, నైపుణ్యాలను ప్రస్తావించడం మర్చిపోవద్దు.
No comments:
Post a Comment